వర్మ బ్రతికించాడు! (కిల్లింగ్ వీరప్పన్ రివ్యూ) .

No Comments
హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ సినిమాలు రియాల్టీకి దగ్గరగా ఉంటాయి. వర్మ టేకింగ్, ఆయన సినిమాల్లో ఇంటెన్సిటీ చాలా బావుంటాయి. ఇవి చూసే చాలా మంది ఆయన సినిమాలకు అభిమానులు అయిపోయారు. అప్పట్లో ఆయన దర్శకత్వంలో వచ్చిన శివ, క్షణక్షణం లాంటి సినిమాలే ఇందుకు నిదర్శనం. అయితే వర్మ ఈ మధ్య కొన్ని చెత్త సినిమాలు, దెయ్యం సినిమాలు తీసి థియేటర్లకు వచ్చిన జనాలను చంపేసాడు. అయితే చాలా కాలం తర్వాత ఆయన ఆ మధ్య ‘రక్త చరిత్ర' సినిమాతో తనదైన మార్కు చూపించి మళ్లీ అభిమానులను మెప్పించాడు. ఆ తర్వాత మళ్లీ కొన్ని సినిమాలతో నరకం చూపించాడు. అయితే ఈ సారి ఆయన తెరకెక్కించిన ‘కిల్లింగ్ వీరప్పన్' మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సారి వర్మ ఏం చూపిస్తాడో అని కాస్త భయపడుకుంటూనే వెళ్లారు ఫ్యాన్స్. అయితే సినిమా చూసిన తర్వాత మాత్రం... జనాలు కాస్త ఊరట పొందారు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను చంపడానికి పోలీసులు పడిన కష్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపడటంలో వర్మ సక్సెస్ అయ్యారు. ఈ సారికి వర్మ బ్రతికించాడు అంటూ... సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Killing Veerappan movie review 
కథ విషయానికొస్తే...కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన గందపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చంపేందుకు చేపట్టిన ఆపరేషన్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి. వందల మంది పోలీసులను వీరప్పన్ బలితీసుకుంటాడు. ఈ క్రమంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ సెంథమరై కన్నన్(శివరాజ్ కుమార్) అతన్ని మట్టు బెట్టడానికి ఎలాంటి ప్రణాళికలు వేసారు? ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేదే స్టోరీ. వాస్తవ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ద్వారా వీరప్పన్ అంత పెద్ద స్మగ్లర్ గా ఎలా ఎదిగాడు? అతని కోసం ప్రభుత్వాలు, పోలీసులు ఎంత కష్టపడ్డాయి అనే విషయం కళ్ళకు కట్టినట్లు తెలుసుకోవచ్చు. నిజ జీవిత కథలతో సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ స్టైల్ బావుంటుంది. గతంలో ఆయన తెరకెక్కించిన నిజజీవిత కథలు ‘రక్తచరిత్ర', ‘ముంబయి 26/11 ' చూసిన వారికి ఆ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ చాలా గ్రౌండ్ వర్క్ చేసాడు. వీరప్పన్ గురించి పత్రికలు, పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని సేకరించడంతో పాటు ఆయన్ను చంపే ఆపరేషన్లో పాల్గొన్న పోలీసులుతో, వీరప్పన్ భార్యతో మాట్లాడి వివరాలు సేకరించారు. వారి ద్వారా తాను తెలుసుకున్న విషయాలకు చక్కగా సినిమా రూపంలోకి తెచ్చారు.  కొన్ని సన్నివేశాలను అటు వీరప్పన్ భార్య యాంగిల్ లో, పోలీసుల యాంగిల్ లో చూపించాడు. వీరప్పన్ చేతుల్లోనే అతడి సొంత కూతురు చనిపోయే సన్నివేశం విషయంలో..... పోలీస్ యాంగిల్లో వీరప్పనే తాను పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పాపను బండరాయికేసి గుద్ది చంపేసినట్లు చూపిస్తారు. వీరప్పన్ భార్య యాంగిల్లో.. వీరప్పన్ కాలికి రాయి అడ్డం పడ్డపుడు కింద పడటం వల్ల పాప చనిపోయిందని చూపిస్తారు. ఇక వర్మ తను అనుకున్నది చూపించడానికి నటీనటులను కూడా పర్ ఫెక్టుగా ఎంపిక చేసాడు. వీరప్పన్ పాత్రలో సందీప్ భరద్వాజ్ ఆ పాత్రలో నటించడం కంటే జీవించాడనే చెప్పొచ్చు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో శివరాజ్ కుమార్ అద్భుతంగా నటించాడు. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పాత్రలో యాగ్నా శెట్టి ఆకట్టుకుంది. సినిమాలో ఓ కీలకమైన పాత్రలో పరుల్ యాదవ్ పెర్ఫార్మెన్స్ బావుంది. అదే సమయంలో తన సినిమాకు కావాల్సిన టెక్నీషియన్స్ ఎంపిక విషయంలో వర్మ చాలా కేర్ తీసుకున్నారు. సందీప్ భరద్వాజ్‌కు వీరప్పన్ లుక్ తేవడంలో మేకప్ మేన్ పనితనం ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. సినిమాటోగ్రాఫర్ రామ్మీ ద్వారా వర్మ తనకు కావాల్సిన విధంగా, పర్ ఫెక్టుగా విజువల్స్ రాబట్టుకున్నాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా సెట్టయింది. ఎడిటింగ్ కూడా బావుంది. ఓవరాల్ గా చెప్పాలంటే.... ‘కిల్లింగ్ వీరప్పన్' ట్రైలర్ చూసి మీరు ఏదైతే ఆశించి వెళతారో..... తెరపై అదే కనిపిస్తుంది. అయితే కమర్షియల్ అంశాలు సినిమాలో ఏమీ లేవు. అలాంటివి ఇలాంటి సినిమాలకు సెట్ కావనే చెప్పాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించేవారు ఈసినిమాకు వెళ్లొద్దు. వీరప్పన్ గురించి, అతన్ని చంపేందుకు చేపట్టిన కుకూన్ ఆపరేషన్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ సినిమా మంచి చాయిస్.

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.