గురువు, 46మంది ఉరితీత: షియాల్లో ఆగ్రహం కట్టలు

No Comments
రియాద్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన ప్రముఖ షియా మత గురువు షేక్‌ నిమ్ర్‌ అల్‌ నిమ్ర్‌ను సౌదీ అరేబియా ప్రభుత్వం ఉరితీసింది. మరో 46 మందికి సైతం శనివారం మరణ శిక్ష అమలు చేసింది. దీంతో తూర్పు సౌదీలో షియాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తమయ్యాయి. బహ్రెయిన్‌లోనూ నిరసనలు చెలరేగాయి. షియాలు పెద్దయెత్తున ఆందోళనలు చేపట్టారు. ఇరాన్‌, ఇరాక్‌ సైతం సౌదీ అరేబియా చర్యల్ని ఖండించాయి. 2011లో చోటుచేసుకున్న అరబ్‌ ఆందోళనల్లో షేక్‌ నిమ్ర్‌ ప్రముఖ పాత్ర పోషించారు. నాడు బహ్రెయిన్‌లోని సున్నీ సర్కారు నుంచి హక్కుల కోసం షియాలు నిరసనలు చేపట్టారు. ఇవి తమ దేశంలోనూ విస్తరిస్తాయేమోనన్న ఆందోళనతో వీటిని అణచివేసేందుకు సౌదీ ప్రభుత్వం సున్నీ సర్కారు తమ బలగాలను బహ్రెయిన్‌కు పంపించింది. దీంతో షియాల హక్కులను కాలరాస్తున్నారని బహ్రెయిన్‌, సౌదీ అరేబియాల్లో సున్నీ సర్కారులపై షేక్‌ నిమ్ర్‌ విమర్శలు గుప్పించారు.  Sheikh Nimr al Nimr: Saudi Arabia executes top Shia cleric 
 తనపై వచ్చిన రాజకీయ ఆరోపణలను షేక్‌ నిమ్ర్‌ ఎప్పుడూ ఖండించలేదు. కానీ తను ఏనాడూ ఆయుధాలు ఉపయోగించలేదని, ఆందోళనలకు పిలుపునివ్వలేదని కేసు విచారణ సమయంలో చెప్పారు. ప్రస్తుతం ఉరితీసిన 47 మందిపై అతివాద విధానాలు అనుసరించడం, ఉగ్రవాదులతో చేతులు కలపడం, వివిధ దాడులకు కుట్రలు పన్నడం తదితర ఆరోపణలు రుజువయ్యాయని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోర్టు ఆదేశాల మేరకే శిక్షలను అమలు చేశామంది. షియాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో.. శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని షేక్‌ నిమ్ర్‌ అల్ నిమ్ర్ సోదరుడు మహమ్మద్‌ అల్ నిమ్ర్‌ విజ్ఞప్తి చేశారు. ఇరాక్‌లో సౌదీ దౌత్య కార్యాలయాన్ని మూసేయాలని, ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాదీ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని షియా దవా పార్టీ అధినేత డిమాండ్ చేశారు. ఉగ్రవాదులు, అతివాదులకు సౌదీ అరేబియా ప్రభుత్వం దన్నుగా నిలుస్తుందని, కానీ స్వదేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని అణచివేస్తుందని, ఇలాంటి విధానాల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్‌ హెచ్చరించింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు నిరసన వ్యక్తం చేశాయి.

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.