రజనీకాంత్ గురించి...మీకు తెలియని ఆసక్తికర విషయాలు

2 comments

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు 64 సంవత్సరాలు పూర్తి చేసుకుని 65వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ గురించి మీకు తెలియని, ఆసక్తికర విషయాలు....
1. ప్రతి హోలీ పండుగకు తన గురువు బాలచందర్‌కు ఫోన్‌చేసి యోగక్షేమాలు తెలుసుకునే వారు. కానీ ఆ రోజే ఎందుకు ఇలా చేస్తున్నారనే విషయం బాలచందర్‌కూ తెలియదు. తీరా కొన్ని సంవత్సరాల తర్వాత అడిగితే.. 'నాకు రజనీకాంత్‌ అని పేరు పెట్టింది హోలీ రోజునే సార్‌!'అన్నారట. బాలచందర్ ఇటీవలే పరమపదించిన సంగతి తెలిసిందే.
2. రజనీకాంత్‌ ఉన్నప్పుడు ఇంటిలో నిత్యం 'ఓం'కార నాదం వింటూనే ఉంటారు.
3. రజనీకాంత్‌ ఇష్ట దైవం వినాయకుడు.
4. తిరుపతి ఆలయంలోనే రజనీకాంత్‌ వివాహం జరిగింది.
5. రోడ్డుపక్కనున్న కాకా హోటళ్ల ప్రియుడు రజనీ. పోరూర్‌ సిగ్నల్‌లోని ఓ రెస్టారెంట్‌కు ఇప్పటికీ వెళ్లొస్తారట.
6. ఏవీఎం స్టూడియోలో రజనీకాంత్‌ మేకప్‌రూమ్‌ నెం.10
7. చెన్నైలో షూటింగ్‌ అంటే రజనీకే కాకుండా, మరో 25 మంది వరకు భోజనం ఇంటి నుంచే వెళ్తుంది.
8. తన ఇంటిలో ఉద్యోగం చేస్తున్న అందరికీ నీలాంగరైలో ఓ ప్లాట్‌ను కొనిచ్చారు. వారిపేరుపై కొంత మొత్తం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కూడా చేశారు.
9. మెరీనాలో విక్రయించే వేరుశనగలంటే రజనీకాంత్‌కు చాలా ఇష్టం.
10. 'ఓ వ్యక్తి దేనినైనా దక్కించుకోవాలని బలంగా ప్రయత్నిస్తే.. ప్రపంచంలోని ఏ శక్తి ఆపజాలదు'.. స్వామి వివేకానందుడి ఈ సూక్తే రజనీకాంత్‌ గుమ్మంపై ఉంటుంది.
11. రజనీకాంత్‌ మాట్లాడిన తొలి పంచ్‌ డైలాగ్‌ 'ఇదు ఎప్పడి ఇరుక్కు'(ఇది ఎలా ఉంది?)
12. రజనీకాంత్‌ మాంసాహార ప్రియుడు. ముఖ్యంగా మటన్‌, తలకాయ కూరంటే ఇష్టంగా తింటారు.
13. తన చిత్ర షూటింగ్‌ పూర్తయ్యాక ఆ చిత్ర సహాయ దర్శకుడికి ఓ మొత్తాన్ని కానుకగా ఇవ్వటం రజనీకాంత్‌ అలవాటు. ఆ మొత్తం కనీసం రూ.50 వేలు.

14. తమిళంతోపాటు, తెలుగు, కన్నడం, మలయాళం, మరాఠి, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.
15. అత్యధికంగా ఎస్‌.పి.ముత్తురామన్‌ దర్శకత్వంలో 25 చిత్రాల్లో నటించారు.
16. హిమాలయాలనే కాకుండా ఏ ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్లినా అక్కడి రుద్రాక్షలను సేకరిస్తూ ఉంటారు. అలా సేకరించిన రుద్రాక్షలు రజనీ ఇంటిలో కుప్పలతెప్పలుగా ఉంటాయి.
17. తనకు నచ్చిన పాటకు సంగీత దర్శకుడెవరో తెలుసుకుని ఫోన్‌ చేసి వారిని అభినందిస్తారు.
18. పోయస్‌ గార్డెన్‌ నివాసంలో ఉంటే రజనీకాంత్‌ నిద్రపోయేసరికి దాదాపు అర్ధరాత్రి అవుతుంది. తన ఇంటిలోని పెద్ద అద్దం ముందు నిలబడి రిహార్సల్స్‌ చేస్తుంటారట.
19. తనకు ఎంత ఆప్తులైనా వారి కోసం సిఫారసు మాత్రం చేయరు.
20. సిగరెట్‌ తాగటం చాలా ఇష్టం. అయితే ఇప్పుడా అలవాటు మానుకున్నారు.
21. రజనీకాంత్‌కు ఎక్కువ చిత్రాలకు సంగీతం అందించిన ఘనత ఇళయరాజాదే. ఇళయరాజాను 'స్వామి' అంటూ మర్యాదగా సంబోధిస్తారు.
22. పర్సు, క్రెడిట్‌ కార్డులు వాడే అలవాటు లేదు. బయకెళ్లినప్పుడు ప్యాకెట్‌ మనీగా కొంత మొత్తాన్ని మాత్రమే తీసుకెళ్తారు.
23. అప్పుడప్పుడు స్నేహితుల ఇంటికి అకస్మికంగా వెళ్లి వారిని ఉత్సాహ పరుస్తుంటారు. తనతో ఫొటో దిగేందుకు వచ్చే వారిలో చిన్నారులుంటే వారిని ఎత్తుకుని ఫోజివ్వటం రజనీకాంత్‌ అలవాటు.
24. పోయస్‌గార్డెన్‌లోని రజనీకాంత్‌ ఇంటి పేరు 'బృందావన్‌'. ఇది ఆయనే పెట్టుకున్నారు. దానిపై 'సత్యమేవజయతే..' అని పెద్దక్షరాలతో లిఖించారు.
25. విమాన ప్రయాణాలకన్నా రైలు ప్రయాణాలకే రజనీకాంత్‌ మొగ్గుచూపుతారు.
26. బూట్లు ధరించటాన్ని ఇష్టపడరు. షూటింగ్‌ సందర్భంలో కూడా అవసరం మేరకే. చెప్పులు ధరించటమే ఇష్టం.
27. ఖాళీగా ఉంటే రోజూ రెండు చిత్రాలను చూడటం అలవాటు. వాటిలో ఒకటి తప్పనిసరిగా ఆంగ్లం ఉంటుంది.
28. ఇరవైసార్లుకు పైగా రక్తదానం చేసిన అభిమానులకు తన సంతకంతో కూడిన ప్రశంసాపత్రం అందించటం రజనీ అలవాటు.
29. తొలినాళ్లలో నలుపు వస్త్రాలను ఇష్టపడే రజనీకాంత్‌ ప్రస్తుతం తెలుపునకు మారారు.
30. రజనీకాంత్‌ నటించిన ఏకైన ఆంగ్ల చిత్రం 'బ్లాడ్‌ స్టోన్‌' 1988 అక్టోబరు 7న విడుదలైంది.
31. 'నేను ఆధ్యాత్మికవేత్తనే. అయితే ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించాలన్నంత కాదు. అలాంటి పద్ధతి నాకు ఇష్టం లేద'ని ఓసారి వ్యాఖ్యానించారు.
32. తన వద్ద 25 ఏళ్లుగా విధులు నిర్వహించి విరమణ పొందిన వ్యక్తిగత సహాయకుడు జయరామన్‌కు నేటికీ వేతనం అందిస్తూనే ఉన్నారు.
33. విదేశాలకు వెళ్లినప్పుడు సరదాగా అక్కడి బస్సుల్లో నిల్చొనే ప్రయాణిస్తారు. కారణం అడిగితే కండక్టర్‌ కాలం నాటి అలవాటు అని చెబుతుంటారు.
34. అల్లుడు ధనుష్‌ ప్రతి పుట్టినరోజుకు ఓ వెండి కంచం, గ్లాస్‌ కానుకగా ఇస్తుంటారు.
35. 'ముల్లుం మలరుం' చిత్రంలో తన నటనను ప్రశంసిస్తూ కె.బాలచందర్‌ రాసిన ఉత్తరాన్ని నేటికీ ఆయన భద్రంగా దాచుకున్నారు.
36. గతంలో రజనీ తన కుడిచేతికి కడియం ధరించేవారు. ఇప్పుడది నెల్త్లెకి చెందిన తన అభిమాని తిరుమారన్‌ కు బహుమతిగా వెళ్లింది.

2 comments

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.